లగచర్ల రైతులను విడుదల చేయండి
ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్ – బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో చోటు చేసుకున్న ఘటనపై స్పందించారు. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎందుకు దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని చూస్తోందంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు ఈటల రాజేందర్. రైతులను పీడించినా, లేదా వారికి బేడీలు వేసినా , దళితులు, గిరిజన బిడ్డలపై దాడులు చేసినా అరెస్ట్ చేసినా లేక కేసులు నమోదు చేసినా ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
పోలేపల్లిలో సెజ్ పేరుతో ఏర్పాటైన ఫార్మా కంపెనీల వల్ల ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు ఇష్టమైతేనే తప్పా భూములు తీసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు.
సాక్షాత్తు వికారాబాద్ జిల్లా కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెప్పినా ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని నిలదీశారు. అభివృద్ది పేరుతో, ఫార్మా కంపెనీ పేరుతో బెదిరింపులకు గురి చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీకి చెందిన ఎంపీ డీకే అరుణను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.