ప్రతి లోగిలిలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాలి
శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి విధు శేఖర భారతి తీర్థ స్వామీజీ
తిరుమల – ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జగద్గురు శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ విదు శేఖర భారతి తీర్థ స్వామీజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్బంగా తిరుమలలోని శృంగేరి పీఠంలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
ధర్మ ప్రచార పరిషత్ ద్వారా, ఆయా మఠాల స్వామీజీలతో అనుసంధానం చేసుకుంటూ దేశ వ్యాప్తంగా ధర్మ ప్రచారం చేపట్టాలని, ప్రతి నోటా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక పరిమలాలు వెదజల్లాలని కోరారు. వేద పండితులు, ధర్మం పట్ల నిబద్దతతో కృషి చేస్తున్న వారితో విస్తృతంగా ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు టీటీడీ పాలక మండలి కృషి చేయాలని సూచించారు.
ఆలయాలు నిత్యం ధూప దీప నైవేద్యాలతో అలరారుతూ ఉండాలని, ఆధ్యాత్మిక శోభతో ముందుకు సాగాలని ఆ దిశగా ప్రయత్నం కొనసాగిస్తుండడం అభినందనీయమన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అష్ట కష్టాలు పడి భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలను కల్పించాలని, ఇదే సమయంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించాలని హితవు పలికారు.
అన్ని దానాలలో కంటే అన్న దానం గొప్పదని, ప్రస్తుతం లక్షలాది మంది భక్తులకు నిరంతరాయంగా కల్పిస్తున్న తీర్థ, అన్న ప్రసాదాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.