ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా..?
శాసన మండలిలో భగ్గుమన్న వంగలపూడి అనిత
అమరావతి – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. వాటన్నింటిని సరిదిద్దేందుకు తమ నాయకుడు , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తంటాలు పడుతున్నారని అన్నారు.
తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని చెప్పారు వంగలపూడి అనిత. ఐదేళ్లు ఉండి మీరు చేసిన అభివృద్ది శూన్యమని, కానీ తాము వచ్చిన 100 రోజుల్లోనే అన్ని రంగాలను అభివృద్ది పథంలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు.
వాస్తవాలను తెలుసు కోకుండా విమర్శలు చేయడం వైసీపీ బాస్ , మాజీ సీఎం జగన్ రెడ్డికి, ఆయన పరివారానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు వంగలపూడి అనిత. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇస్తోన్న ఉచిత సిలిండర్ల పథకం చూసి ఓర్వలేక వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని హోంమంత్రి విమర్శించారు.
విపక్ష సభ్యులు బడ్జెట్ ను చదివి అర్థం చేసుకుని ఆపై అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని ఆమె హితవు పలికారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశామని క్లారిటీ ఇచ్చారు. సత్యాలు చెప్పి సభలో సద్విమర్శ చేస్తే ఆహ్వానిస్తామన్నారు. కానీ, లేనిపోని అభాండాలతో అబద్ధాలు చెబితే సభా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని హోంమంత్రి సభ్యులకు వెల్లడించారు.