రైతుల అరెస్ట్ అప్రజాస్వామికం – ఈటల
కాంగ్రెస్ సర్కార్ పై రాజేందర్ ఆగ్రహం
హైదరాబాద్ – దాడికి పాల్పడ్డారనే నెపంతో అరెస్ట్ చేసిన కోడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానిక చెందిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం అన్యాయమని అన్నారు. ఎస్పీ దగ్గరుండి కొట్టించాడని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే కలెక్టర్ తనపై దాడి జరగలేదని అంటున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం వారిపై కేసులు నమోదు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు బాధితులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. లగచర్ల కు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు ఈటల రాజేందర్.
ఫార్మా కంపెనీల ఏర్పాటు పేరిట లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, పులిచర్ల పరిధిలో సుమారు 1350 ఎకరాలతో పాటు మరో 1500 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించాలని ఆలోచన చేయడం దారుణమన్నారు.
కొంతమంది దళారులు, మధ్యవర్తులు అసైన్డ్ భూములు పొందిన వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భూమినే నమ్ముకుని బతుకుతున్న రైతుల నుంచి రూ. 40 లక్షల విలువైన భూమిని కేవలం రూ. 10 లక్షలకే గుంజుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.