చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే
ఏపీ అప్పులపై జగన్ రెడ్డి కామెంట్స్
అమరావతి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలకు సూపర్ సిక్స్ ఇస్తానని చెప్పి బడ్జెట్ లో వాటి ఊసే లేకుండా చేశావంటూ ఎద్దేవా చేశారు జగన్ రెడ్డి. ఇది అబద్దం కాదా అంటూ ప్రశ్నించారు.
ఆడ బిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18 వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావో చెప్పాలన్నారు.
దీపం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావో బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు జగన్ రెడ్డి.
తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అని అన్నావు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావో చెప్పాలి కదా అంటూ నిలదీశారు .
అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని అన్నారు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావో చెప్పాలన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని చెప్పావని .. దాదాపు ఏడాదికి రూ.3 వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదన్నారు. దాని ఊసే ఎత్తడం లేదంటూ మండిపడ్డారు.
యువగళం కింద రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నావ్. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36 వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావో చెప్పక పోతే ఎలా అని ప్రశ్నించారు జగన్ రెడ్డి.
50 ఏళ్లు పైబడిన వారికి రూ.4 వేలు పింఛన్ ఇస్తానన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావో చెప్పగలవా చంద్రబాబూ అంటూ ఎద్దేవా చేశారు.