తిరుమలలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ
పెద్ద ఎత్తున పాల్గొన్న శ్రీవారి భక్తులు
తిరుమల – తిరుమలలో కార్తీక పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనం అనేది సర్వ పాప ప్రాయశ్చిత్తం కలుగుతుందని ప్రతీతి. ఇదిలా ఉండగా పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామి వారు దాసాను దాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ జెబుతారు.
అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజెబుతున్నాడు.
కార్తీక పౌర్ణమి గరుడ సేవ కార్యక్రమం సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈవో జె. శ్యామల రావు, ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు వీర బ్రహ్మం, గౌతమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.