గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించండి
ఏపీ ప్రభుత్వానికి వైఎస్ షర్మిల డిమాండ్
అమరావతి – ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. రాష్ట్రంలోని గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
గ్రూప్ 2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్ని , గ్రూప్ 1 మెయిన్స్ కి సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నామని కోరారు వైఎస్ షర్మిలా రెడ్డి. GO నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీ కి ఉందన్నారు.
ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందని స్పష్టం చేశారు. 89 పోస్టులకు మీరు ఇచ్చిన 1:50 రేషియో ద్వారా 4450 మంది మెయిన్స్ కి అర్హత పొందారని తెలిపారు.
1:100 రేషియో లెక్కన పిలిస్తే మరో 4450 మందికి అవకాశం దక్కుతుందని అభ్యర్థులు ఆశ పడుతున్నారని పేర్కొన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం, సిలబస్ మధ్య వ్యత్యాసం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే పరీక్షలు నిర్వహించడం లాంటి కారణాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వాపోయారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాలు మళ్ళీ పోతే ఇప్పట్లో ఇక నోటిఫికేషన్ ఉండదని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ని కలిసి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి, న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.