చైర్మన్ కు కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వనం
బీఆర్ నాయుడును కలిసిన ఈవో,ఏఈవో, జేఈవో
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడుకు టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు అందించి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో శనివారం అందించారు.
శ్రీపద్మావతీ అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతీ అమ్మ వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడుకు వివరించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి ఛైర్మన్ సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని, భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చేలా చూడాలని అన్నారు బీఆర్ నాయుడు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.