జగనన్నా రాజీనామా చేస్తే బెటర్
నిప్పులు చెరిగిన సోదరి వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై భగ్గుమన్నారు. ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజప్రతినిధిగా ఉంటూ ఎందుకు అసెంబ్లీకి ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. ప్రజల తరపున గొంతు విప్పాల్సిన మీరు ఇప్పటి దాకా ఇంట్లోనే ఉంటే ఎలా అని నిలదీశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఒక బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఇలాగేనా వ్యవహరించేది అంటూ మండిపడ్డారు. మీరు అహంకారంతో వ్యవహరిస్తూ పోతే చివరకు రాబోయే రోజుల్లో 11 సీట్లు కూడా రావని గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.
అసెంబ్లీకి పోను అనడం మీ అహకారానికి నిదర్శనం అన్నారు. మిమ్మల్ని గెలిపించిన ప్రజలపై మీకు బాధ్యత లేదా అని నిలదీశారు వైఎస్ షర్మిల. ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్ళరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పడు మీకు 11 సీట్లు మాత్రమే ఎందుకు ఇచ్చారోనని ఇప్పుడైనా ఆలోచించక పోతే ఎలా అని అన్నారు. మీకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం, సామర్థ్యం లేకుంటే జగన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.