కుటుంబీకులను ఓదార్చిన చంద్రబాబు
కన్నీటి పర్యంతం అయిన ఏపీ సీఎం
హైదరాబాద్ – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కంట తడి పెట్టారు. తన స్వంత సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో కన్ను మూశారు. అధికారిక పర్యటనలో ఉన్న చంద్రబాబు ఢిల్లీ నుంచి హుటా హుటిన నగరానికి వచ్చారు. విగతజీవిగా మారిన తన తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
పక్కనే ఉన్న కొడుకులు నారా రోహిత్, నారా గిరీష్ లను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. తమ కుటుంబానికి ఇది బిగ్ షాక్ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 1994 నుంచి 1999 దాకా చంద్రగిరి నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు.
1999లో గల్లా అరుణ కుమారి చేతిలో ఓటమి పాలయ్యారు నారా రామ్మూర్తి నాయుడు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవలే ఆయన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. చివరకు కన్ను మూయడంతో నారా వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా ఆదివారం నారావారి పల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.