నటి కస్తూరి శంకర్ అరెస్ట్
హైదరాబాద్ లో అదుపులోకి
హైదరాబాద్ – తెలుగు వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటి కస్తూరి సురేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఆమెను హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉండగా పట్టుకున్నారు. అక్కడి నుంచి తమిళనాడుకు తరలించారు.
తెలుగు సమాజాన్ని కించ పరిచేలా మాట్లాడిన కస్తూరి శంకర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తమిళనాడులోని పలు చోట్ల తెలుగు వారు ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసులు నమోదయ్యాయి. ఆమెపై కేసు నమోదు కావడంతో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది.
విచారణ చేపట్టిన ధర్మాసనం సీరియస్ అయ్యింది. నటి కస్తూరి శంకర్ కు బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. తెలుగు వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, వెంటనే కస్తూరి శంకర్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది కోర్టు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెకు నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా ఆమెను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన వారికి ఇల్లు తాళం వేసి ఉండడం గమనించారు. తప్పించుకు తిరుగుతున్న నటి కస్తూరి శంకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లో దొరకడం విశేషం.