పంచాయతీలకే తాగు నీటి నిర్వహణ
స్పష్టం చేసిన సీఎం ఏ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. గ్రామాల్లో తాగు నీటి నిర్వహణ బాధ్యత పూర్తిగా గ్రామాల పంచాయతీలదేనని స్పష్టం చేశారు. మంగళవారం తాగు నీటి నిర్వహణపై సీఎం సమీక్ష చేపట్టారు.
తాగు నీరు అందని గ్రామాలను గుర్తించేందుక సర్వే చేపట్టాలని ఆదేశించారు. తాగు నీటి కోసం ప్రతి నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు. కృష్ణా, గోదావరితో పాటు కొత్త ప్రాజెక్టుల వినియోగంలోకి రావాలన్నారు.
రోడ్లు లేని 422 గ్రామాలు, 3,177 ఆవాసాలకు తారు రోడ్లను మంజూరు చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. స్వయం సహాయక సంఘాలకు చేయూత ఇచ్చేందుకు కొత్త కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ శాఖపై పూర్తి సమీక్ష జరిగింది. మంత్రులు దాసరి సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.
వచ్చేది వేసవి కాలమని, తాగు నీటి ఎద్దడి అన్నది లేకుండా చూడాలని , ఇందు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించు కోవాలని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన రిజర్వాయర్ల నుంచి కూడా తాగు నీటి అవసరాలకు వాడు కోవాలని సూచించారు సీఎం.
మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగ నాయక్ సాగర్ లాంటి కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లన్నింటినీ తాగునీటికి వాడుకోవాలని అన్నారు.