మణిపూర్ లో ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ
బీజేపీ ప్రభుత్వానికి ఊహించని షాక్
మణిపూర్ – మణిపూర్ రాష్ట్రం భగ్గుమంటోంది. బీరేన్ సర్కార్ లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడంలో విఫలమైంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తాము మద్దతు ఉప సంహరించు కుంటున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కన్రాడ్ సంగ్మా కీలక ప్రకటన చేశారు. ఈమేరకు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు , కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు.
దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీఎం బీరేన్ పూర్తిగా వైఫల్యం చెందారంటూ ఎన్పీపీ అధ్యక్షుడు ఆరోపించారు.
రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులను నియంత్రించడంలో సీఎం ఘోరంగా వైఫల్యం చెందారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు మణిపూర్ లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారు. సీఎం ఇంటిపై ఆందోళనకారులు దాడి చేసేందుకు ప్రయత్నించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు భద్రతా దళాలకు సహకరించాలని హోం మంత్రిత్వ శాఖ ప్రజలను అభ్యర్థించింది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్ కూడా మణిపూర్ చేరుకున్నారు.
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా మారడం, ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దారుణమన్నారు ఎన్పీపీ చీఫ్ కన్రాడ్ సంగ్మా.