NEWSTELANGANA

బీఆర్ఎస్ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు

Share it with your family & friends

డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

హైద‌రాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌భుత్వం పై త‌మ‌పై క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డుతోంద‌ని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ మేర‌కు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆధ్వ‌ర్యంలో ప‌లువురు నాయ‌కులు డీజీపీ ర‌వి గుప్తాను కలిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ప‌నిగ‌ట్టుకుని త‌మ వారిని టార్గెట్ చేసి దాడుల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆరోపించారు.

హుజూర్ నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేశార‌ని, భౌతిక దాడుల‌కు పాల్ప‌డ్డారంటూ డీజీపీకి తెలిపారు. మంత్రి కోమటి రెడ్డి సమక్షంలో ఆయన ప్రోద్భలంతో భువనగిరి జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు జరిపిన దాడిని డీజీపీకి వివరించారు.

పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకకుండా నిష్పక్ష పాతంగా వ్యవహరించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విన్న‌వించారు.

డీజీపీని కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైది రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, కోరుకంటి చందర్, భువనగిరి జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి, సూర్యపేట జెడ్పి చైర్ పర్సన్ దీపిక, బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, రాకేష్ కుమార్ తదితరులు ఉన్నారు.