కొణతం దిలీప్ రెడ్డిని విడుదల చేయాలి
డిమాండ్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – మాజీ తెలంగాణ సోషల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. సోమవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రశ్నించడం ప్రజాస్వామిక లక్షణమని పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ , విచారణ పేరుతో పిలిపించి అరెస్ట్ చేయడం అమానుషమని అన్నారు కేటీఆర్.
ప్రశ్నిస్తే సంకెళ్లు, నిలదీస్తే అరెస్ట్ లు చేస్తుండడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారంటూ ప్రశ్నించారు కేటీఆర్.
తమకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉందని, ప్రజా స్వామ్య బద్దంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రత్యేకించి కక్ష సాధింపు, ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు .
ఓ వైపు ప్రజా పాలన సాగిస్తున్నామంటూ చెబుతూ మరో వైపు కేసులు నమోదు చేయడం, దాడులకు తెగబడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు మాజీ మంత్రి.