ఎమ్మిగనూరు నీటి సమస్య పరిష్కరిస్తాం
అసెంబ్లీలో డాక్టర్ పొంగూరు నారాయణ
అమరావతి – గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి తాగు నీటి సమస్య నెలకొందని ఆరోపించారు ఏపీ పట్టణ, పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. సోమవారం ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏఐఐబీ నిధులకు రాష్ట్ర వాటా కేటాయించక పోవడంతో పనులు నిలిచి పోయాయని తెలిపారు.
ఎమ్మిగనూరు మున్సిపాల్టీకి గాజులదిన్నె తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం కోసం 148 కోట్లతో గాజులదిన్నె తాగునీటి పథకం పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పారు.
2039 కి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తున్నామని తెలిపారు .ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు మున్సిపాల్టీకి తుంగభద్ర డ్యాం లోలెవల్ కెనాల్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని అయితే 14.07ఎంఎల్ డీ నీటి అవసరం ఉండగా….ప్రస్తుతం 10.45ఎంఎల్ డీ మాత్రమే నీటి సరఫరా జరుగుతుందని చెప్పారు.
2019 ఫిబ్రవరిలో 5350 కోట్లతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలకు తాగునీరు అందించేందుకు ఏఐఐబీ ముందుకొచ్చిందని తెలిపారు. .ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ 70 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు సమకూర్చాల్సి ఉందన్నారు.