ప్రజా యుద్ద నౌక విగ్రహానికి ఓకే
ప్రకటించిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్ – ప్రజా యుద్ద నౌక , ప్రముఖ గాయకుడు గద్దర్ కు నివాళిగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీ తీర్మానం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియ చేసింది. స్థలం ఏర్పాటు చేసే విషయానికి సంబంధించి సీఎస్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.
దీంతో విషయం తెలిసిన వెంటనే ఆమోదం తెలిపారు రేవంత్ రెడ్డి. భారత దేశ సాంస్కృతిక విప్లవానికి ఊపిరి పోసిన అరుదైన గాయకుడిగా, యుద్ద నౌకగా గుర్తింపు పొందారు గద్దర్. ఆయనను స్మరించు కోవడం తెలంగాణకు అత్యంత అవసరమని కవులు, కళాకారులు, గాయనీ గాయకులు, రచయితలు, మేధావులు, ప్రజా సంఘాలు , బుద్ది జీవులు , వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అభిప్రాయపడ్డారు.
గద్దర్ కు నివాళులు అర్పించేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాము ముందుకు వస్తామని పలువురు పేర్కొన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేక పోయినా ప్రజల గుండెల్లో చిర స్థాయిగా ఉంటాడని స్పష్టం చేశారు.