తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు
టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం – చైర్మన్
తిరుమల – టీటీడీ నూతన బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. కీలక అంశాలపై చర్చించింది. ఈ మేరకు తిరుమల పుణ్య క్షేత్రంలో ఇక నుంచి ఎవరైనా సరే రాజకీయాలు మాట్లాడితే కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. కీలక తీర్మానాల గురించి ఈవో జె. శ్యామల రావుతో కలిసి వెల్లడించారు.
తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టకూడదు. సర్వ దర్శనం భక్తులకు 2, 3 గంటల్లో దర్శనం ఏఐ సహకారంతో అయ్యేలా చూడాలి. విశాఖ శారదా పీఠం లీజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , అధునాతన టెక్నాలజీని ఉపయోగించి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన సమయాన్ని 20-30 గంటల నుండి 2-3 గంటలకు తగ్గించాలని నిర్ణయించామన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసి..దానిని నేరుగా టీటీడీ ఖాతాలో విలీనం చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. వివిధ రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్ల దర్శన్ కోటాను రద్దు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. తిరుమల డంపింగ్ యార్డులో పేరుకు పోయిన చెత్తాచెదారాన్ని మూడు లేదా నాలుగు నెలల్లో తొలగిస్తామన్నారు.
శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పేరును గరుడ వారధిగా మార్చనున్నారు. అలిపిరి వద్ద టూరిజంకు ఇచ్చిన 20 ఎకరాల భూమిని దేవ్‌లోక్ ప్రాజెక్ట్ సమీపంలో టిటిడికి అప్పగించాలని కోరుతూ రాష్ట్ర సర్కార్ కు విన్నవించాలని నిర్ణయం .
తిరుమలలో పని చేస్తున్న హిందువేతరులపై తగిన నిర్ణయం తీసుకోవాలని లేఖ రాయాలని నిర్ణయించామన్నారు చైర్మన్ బీఆర్ నాయుడు. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు దర్శనం కల్పిస్తోందన్నారు.
టీటీడీ డిపాజిట్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ బ్యాంకుల్లో ఇప్పటికే డిపాజిట్ చేసిన వాటిని వెనక్కి తీసుకుని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
శ్రీవారి లడ్డూ తయారీలో నాణ్యమైన నెయ్యిని ఉపయోగించడం. భక్తుల కోసం తిరుమలలోని అన్న ప్రసాదం కాంప్లెక్స్‌లో ప్రతిరోజూ మెనూలో మరో రుచికరమైన వంటకాన్ని పరిచయం చేస్తున్నామని తెలిపారు
వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌ను ఆధునీకరించడంతో పాటు శ్రీవారి ఆలయంలోని పురాతన పోటు-ఆలయ వంట గదిలోని లీకేజీల మరమ్మతులను టీవీఎస్ సంస్థ చేపట్టనుందని వెల్లడించారు బీఆర్ నాయుడు.
ఈ ఏడాది అక్టోబరు 4 నుంచి 13వ తేదీ వరకు జరిగిన తిరుమల శ్రీవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు అందించిన ఉద్యోగుల బహుమానం 10 శాతం పెంపునకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. రెగ్యులర్ ఉద్యోగులు రూ. 15,400, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 7,535 ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు చైర్మన్.