టీటీడీ శ్రీవాణి ట్రస్టు రద్దు – చైర్మన్
టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం
తిరుమల – టీటీడీ ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీటీడీ శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు. త్వరగా దర్శనం అయ్యేలా ఐఏ టెక్నాలజీ వినియోగిస్తామన్నారు. ఈ మేరకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇక నుంచి అన్యమతస్తులకు, హిందూయేతరులకు చోటు లేదని స్పష్టం చేశారు చైర్మన్ బీఆర్ నాయుడు. రాజకీయాలు మాట్లాడినా లేదా ప్రచారం చేసినా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. నిత్య అన్నదానంలో మార్పులు చేస్తున్నామని, మరో పదార్థాన్ని చేరుస్తున్నామని వెల్లడించారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పోరేషన్లు, ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300/-) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు టీటీడీ చైర్మన్.
శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు, అన్న ప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ చేసుకుంటున్నామని తెలిపారు.