దీపోత్సవం జ్ఞాన జ్యోతులు వెలిగించాలి
కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి
తిరుపతి – వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సర్వ సంప్రదాయాలకు కార్తీక మాసం శ్రేష్టమైనదని, ఈ మాసంలో దైవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వందల రెట్లు అధికంగా ఫలితం కలుగుతుందని కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి స్వామిజీ ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి స్వామిజీ అనుగ్రహ భాషణం చేస్తూ దీపాన్ని వెలిగిస్తే మనలోని అజ్ఞానం అనే అంధకారం తొలగి జ్ఞానం అనే వెలుగు ప్రకాశిస్తుందన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు.
శివ కేశవుల వైశిష్ట్యం, దీపం ప్రాముఖ్యత, దీపారాధన వల్ల అజ్ఞానమనే చీకటిని పారద్రోలి ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక జ్ఞాన దీపాలు వెలిగించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నానని చెప్పారు.
దైవ నామాన్ని జపిస్తే దీర్ఘాయువు కలుగుతుందన్నారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీనివాసుని కటాక్షం కలగాలని స్వామీజీ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు.
ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్ర హారతి, కుంభహారతి సమర్పించారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె.శ్యామల రావు, బోర్డు సభ్యులు జంగా కృష్ణ మూర్తి, భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు,, హెచ్డీపీపీ ప్రత్యేక అధికారి రాజగోపాల్, సెక్రటరీ రఘునాథ్, అడిషనల్ సెక్రటరీ రాంగోపాల్, అర్చక బృందం, వేద పండితులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.