సీఎంపై ఈటల రాజేందర్ ఫైర్
ఇంత దుర్మార్గుడిని చూడలేదు
హైదరాబాద్ – బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని అన్నారు. మంగళవారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని కానీ ఇలాంటి సీఎంను తాను చూడ లేదన్నారు. ప్రజలను దొంగలు లాగా చూస్తుండడం దారుణమన్నారు.
హైడ్రా పేరుతో ధ్వంసం చేశారని, ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల,తదితర గ్రామాలలో రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు దిగడం మంచి పద్దతి కాదన్నారు. ఇవాళ తనతో పాటు ఎంపీ డీకే అరుణ కూడా అక్కడికి వెళ్లామని, కానీ తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ ) కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. రైతులను పోలీసు కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.
ఇప్పటికీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వెంటనే NHRC బృందాలను లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. హైడ్రా, మూసీ అయి పోయింది ఇక లగచర్ల మాత్రమే మిగిలి ఉందన్నారు. ఇలాంటి చర్యలను ఎవరూ హర్షించరని అన్నారు ఈటల రాజేందర్.