విజయోత్సవాలు సరే సమస్యల మాటేంటి..?
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కామెంట్స్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ ఏం సాధించారని విజయోత్సవాలు నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేశారా అని అన్నారు. అన్ని వర్గాలను నమ్మించి మోసం చేశారని, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక వాటి ఊసెత్తడం లేదన్నారు.
వరంగల్ వేదికగా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు హరీశ్ రావు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకు వెళ్లిన ఘనత సీఎంకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. వరంగల్ డిక్లరేషన్ మరిచి పోతే ఎలా అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ చేతిలో ప్రజలు దగా పడ్డారంటూ వాపోయారు . రైతులు దారుణంగా మోస పోయారంటూ ఆవేదన చెందారు . తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పి పుచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారంటూ పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్ అటకెక్కిందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తుంటే నేటి రేవంత్ రెడ్డి పాలనలో తిరోగమనంలోకి పోతోందన్నారు.
సమస్యలు పేరుకు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గుర్తిస్తే మంచిదని హితవు పలికారు.