తాగుబోతుల సంఘానికి కేసీఆర్ పెద్దన్న
సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం వరంగల్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు. మాజీ సీఎం కేసీఆర్ పై , ఆయన కుటుంబంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ కు పనేమీ లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు సీఎం. హాఫ్ కు, ఫుల్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆయన అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండాలని, దగ్గర ఉన్న వైన్ షాప్ కు చెబుతానని కావాల్సినప్పుడల్లా సీసాలు అందిస్తాడని అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో నలుగురు పదవులు కోల్పోయారని, తెలంగాణ సమాజం ఏమీ కోల్పోలేదన్నారు.
రాష్ట్రాన్ని తాగుబోతుల ప్రాంతంగా మార్చేశాడని, ఊరూరా బెల్టు షాపులు తెరిచి , అందరినీ మత్తులో ముంచి పాలన చేద్దామని ప్లాన్ చేశాడని ధ్వజమెత్తారు. కానీ ఆయన పాచికలు పారలేదని , ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారని అన్నారు సీఎం. తనను ఎదుర్కొనేంత సీన్ కేసీఆర్ కు లేదన్నారు.