కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ తగదు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ – ఇక నుంచి కాంట్రాక్టు కింద పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయొద్దని స్పష్టం చేసింది రాష్ట్ర హైకోర్టు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇలా చేస్తే ప్రతిభ కలిగిన వారికి నష్టం చేకూరుతుందని పేర్కొంది. కాంట్రాక్టు కింద పనిచేస్తున్న వారిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మినెంట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది కోర్టు.
ఈ నిర్ణయాన్ని తప్పు పట్టింది. కాగా గతంలో పర్మినెంట్ చేసిన వారిని తొలగించవద్దని, ఇక నుంచి మాత్రం కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను పర్మినెంట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
కాగా ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 16ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పనిచేస్తున్న కాంట్రాక్టు ఎంప్లాయిస్ కు ఈ కోర్టు నిర్ణయం ఆశనిపాతంగా మారింది.
తమతో వెట్టి చాకిరి చేయించుకుంటూ వస్తున్నారని, తమకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఇప్పటికే ఆందోళనలు , ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను పర్మినెంట్ చేయడం అనేది నిబంధనలకు విరుద్దం అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ భగ్గుమంటున్నారు.