విశాఖ డెయిరీ స్కాంపై విచారణ చేపట్టాలి
ఏపీ శాసన సభలో హాట్ డిస్కషన్
అమరావతి – విశాఖ డెయిరీ సహకార రంగం నుంచి కార్పొరేట్ రంగంగా మారడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ చట్టానికి మార్చడం వల్ల అవినీతి చోటు చేసుకుందంటూ మండిపడ్డారు మంత్రి పల్లా శ్రీనివాసరావు. 2,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న డెయిరీ నష్టాల బారిన పడటానికి అవకతవకలే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
రెండున్నర లక్షల పాడి రైతుల జీవితాలను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని వాపోయారు.
చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఒకే కుటుంబానికి చెందిన వారేనని, వారే ట్రస్టు ఏర్పాటు చేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తక్కువ ధరకు పాలను కొనుగోలు చేసి, మార్కెటింగ్ చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సహకార రంగం పేరుతో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందిన వారు, 2006లో కంపెనీ చట్టం కింద మార్పు చేసుకొని ఆస్తులను కాజేశారంటూ ఆరోపించారు.