సీఎక్స్ఓలతో సీఎం చర్చలు సఫలం
ఏపీలో ఐటీ పరంగా కీలక మార్పులు
అమరావతి – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. ఐటీ, డ్రోన్ టెక్నాలజీ, లాజిస్టిక్, పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే దిగ్గజ ఐటీ సంస్థ టాటా గ్రూప్ సంస్థ విశాఖలో ఆర్ అండ్ డి సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇదే క్రమంలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు , కంపెనీలను స్థాపించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. భారీ పెట్టుబడిని ఇటీవలే ప్రకటించింది జిందాల్ స్టీల్ కంపెనీ. ఏకంగా రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
తాజాగా ఐటీ ల్యాండ్ స్కేప్ ను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ డెవలపర్‌లు, జీసీసీలు, హెచ్ టీ డీ భాగస్వాములకు చెందిన సీఎక్స్ ఓ (CXO) లతో ఫలవంతమైన చర్చలు జరిపారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు .
కో-వర్కింగ్ స్పేస్‌లు, పొరుగు హబ్‌లు, ఇంటిగ్రేటెడ్ ఐటి పార్కుల ద్వారా సౌకర్యవంతమైన పని నమూనాల ఉపాధి సామర్థ్యాన్ని గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఆవిష్కరణ, సహకారాన్ని పెంపొందించడానికి ఏపీ రాష్ట్రం కీలకమైన వనరుగా ఉంటుందని స్పష్టం చేశారు సీఎం.
ఉత్తమమైన సౌకర్యాలు, ప్రోత్సాహకాలు , అనుకూలమైన వాతావరణాన్ని నిర్ధారిస్తుందని వారికి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ప్రపంచ స్థాయి ఐటి పాలసీతో నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా ఉంచే భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.