NEWSTELANGANA

పిల్ల‌లు అల్లాడుతుంటే ప‌ట్టించుకోక పోతే ఎలా

Share it with your family & friends

తెలంగాణ స‌ర్కార్ పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
హైద‌రాబాద్ – ఓ వైపు పిల్ల‌లు అల్లాడుతుంటే ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు పిల్ల‌లు అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం ప‌ట్ల‌. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

విద్యా రంగాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌డం ప్ర‌మాద‌మ‌ని, ఇప్ప‌టికే చాలా మంది విద్యార్థులు అనారోగ్యానికి గుర‌వుతున్నార‌ని వాపోయారు కేటీఆర్. విద్యార్థుల‌కు ప‌రిశుభ్ర‌మైన ఆహారం అందించ‌లేని రేవంత్ రెడ్డి మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తాన‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

రోజుకో గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నార‌ని పేర్కొన్నారు.
గ‌తంలో ఎన్నడూ లేని విధంగా గురుకుల పాఠశాలలలో ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయార‌ని తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు కేటీఆర్.

పిల్లలు పిట్టల్లా రాలుతుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా వేదికల మీద పిట్టలదొర మాటలు మాట్లాడితే ఎలా అని సెటైర్ వేశారు. రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, విద్యార్థులు ఆస్ప‌త్రుల్లో, రైతులు జైలులో ఉన్నార‌ని రాబోయే రోజుల్లో ఇంకెన్ని దారుణ‌మైన ప‌రిస్థితుల‌ను చూడాల్సి వ‌స్తోంద‌నని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు .