NEWSTELANGANA

పోలీసుల లాంగ్ మార్చ్ పై కేటీఆర్ ఫైర్

Share it with your family & friends

ప్ర‌జా పాల‌న పేరుతో రాచ‌రిక పాల‌న

హైద‌రాబాద్ – రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జ‌లు బ‌తికే ప‌రిస్థితి లేకుండా పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తోంద‌ని ఆరోపించారు.

ఎక్క‌డైనా ఎన్నిక‌లు నిర్వ‌హించిన స‌మ‌యంలో లేదా మ‌త ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన‌ప్పుడు మాత్ర‌మే పోలీసులు లాంగ్ మార్చ్ చేస్తార‌ని కానీ విచిత్రం ఏమిటంటే మ‌హ‌బూబాద్ జిల్లా మానుకోట‌లో లాంగ్ మార్చ్ చేప‌ట్ట‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు కేటీఆర్.

అక్క‌డ ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గలేద‌ని, మ‌రి పోలీసులు హెచ్చ‌రిక‌లు ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. అస‌లు మానుకోటలో ఏం జ‌రుగుతోందంటూ మండిప‌డ్డారు. శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.

ఇలా చేస్తే ప్రజాపాలన ఎలా అవుతుందని అన్నారు . ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష‌ల‌ పాలన, ఆంక్షల పాలన.. మొత్తంగా రాక్షస పాలన అంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్.