విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కీలక కామెంట్స్
ప్రాజెక్టుకు సంబంధించి నివేదిక పంపించాం
అమరావతి – విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ పట్టణ, పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. శుక్రవారం శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక కేంద్రానికి పంపించడం జరిగిందని చెప్పారు.
కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు పొంగూరు నారాయణ.
వంద శాతం కేంద్రమే నిధులు భరించేలా నిర్మాణం చేపట్టాలని కోరామన్నారు. మొదటి ఫేజ్ లో 46.2 కి మీ లతో మూడు కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు మంత్రి.
మొదటి ఫేజ్ లో స్థానిక ఎమ్మెల్యేలు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారని చెప్పారు. ఈ కారిడార్స్ లో హనుమంతు వాక, మద్దెలపాలెం , విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కయ్యపాలెం ప్రాంతాలలో 14 జంక్షన్లు ఉన్నాయని తెలిపారు.
ఈ ప్రాంతాలలో 8 మీటర్ల ఫ్లై ఓవర్ , దానిపైన మెట్రో నిర్మాణం చేయమని తమను కోరారని, దానిపై కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు డీపీఆర్ చేయాలని నిర్ణయించామన్నారు డాక్టర్ పొంగూరు నారాయణ.