ఏపీలో నూతన టూరిజం పాలసీ – దుర్గేష్
శాసన సభ సాక్షిగా ప్రకటించిన మంత్రి
అమరావతి – ఏపీ రాష్ట్రానికి సంబంధించి నూతన పర్యాటక (టూరిజం) పాలసీని ప్రకటించారు రాష్ట్ర
పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ . పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ నూతన పర్యాటక విధానం 2024-2029 రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి చాలా కీలకమైనదని అన్నారు మంత్రి. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధితో పాటు స్థానిక జన సమూహాలను బలోపేతం చేయాలన్న విజన్ తో పర్యాటక పాలసీని రూపొందించామని చెప్పారు.
పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు నాయుడు పరిశ్రమ హోదా కల్పించడం శుభ పరిణామమని అన్నారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిన రాష్ట్రంగా చరిత్రలో ఏపీ పేరు చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. పరిశ్రమ హోదా కారణంగా పర్యాటక రంగానికి మరింత ఊపు తెచ్చేలా చేస్తుందన్నారు.
పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించేలా పాలసీని తయారు చేశామన్నారు కందుల దుర్గేష్. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్నది కూటమి లక్ష్యమన్నారు.
పర్యాటక రంగం ద్వారా ఏపీలో 20 శాతం పైబడి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు కందుల దుర్గేష్.
బాధ్యతాయుతమైన పర్యాటకం, టూరిజంలో సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. 4.6 శాతం ఉన్న జీవీఏను 28 శాతానికి పెంచడం, పర్యాటక రంగంలో 12 శాతం ఉపాధిని 15 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పాలసీ తయారు చేసినట్లు తెలిపారు.
భారతదేశానికి విదేశీ పర్యాటకులు అత్యధికంగా వచ్చే టాప్ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ను ఒకటిగా తయారు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.