DEVOTIONAL

తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

Share it with your family & friends

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

తిరుప‌తి జిల్లా – తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి, పోలీస్, తిరుచానూరు రెవిన్యూ అధికారులకు సూచించారు టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు. తిరుప‌తిలోని టీటీడీ అతిథి గృహంలో ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేప‌ట్టారు. అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడారు.

6వ తేదీన నిర్వహించనున్న పంచమీ తీర్థం రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, పుష్కరిణిలో తోపులాటలు జరుగకుండా, ట్రాఫిక్ నిలిచి పోకుండా పోలీసులు, విజిలెన్స్ అధికారులు సమన్వయం చేసుకోవాలి సూచించారు.

తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల అనంతరం భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తిరుపతి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అవసరమైన వైద్య బృందాలు, బారికేడ్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.

అంతే కాకుండా మొబైల్ ఫైర్ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స వైద్య బృందాలు, సైన్ బోర్డ్ లు, భక్తుల తాకిడికి తగ్గట్టుగా అన్న ప్రసాదాల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు ఈవో. అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయ మీటింగ్ లు ఏర్పాటు చేసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

జిల్లా ఎస్పి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు, పంచమి తీర్థం రోజున భక్తులు అధిక సంఖ్యలో రానుండ‌డంతో గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తులు, యాత్రికుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ సమస్య తలెత్త కుండా, దొంగతనాలు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్ల‌డించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి , ఎస్బి డీఎస్పీ గిరిదర, చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ , ఎస్బి సిఐ శ్రీనివాసులు, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, టిటిడి ఎఫ్ ఏ అండ్ సీఏవో బాలాజీ, సీఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో గోవింద రాజన్, హెల్త్ ఆఫీసర్ సునీల్ , తిరుపతి, తిరుచానూరు కి చెందిన పోలీసు, రెవిన్యూ తదితర అధికారులు పాల్గొన్నారు.