కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయం
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా కోడంగల్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ భూములను ఇవ్వమంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డిని వామపక్ష పార్టీల బృందం కలుసుకుంది. ఈ సందర్బంగా వారికి పూర్తి హామీ ఇచ్చారు . కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పారు సీఎం..ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని చెప్పారు. కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి తన భాధ్యత అని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలను తాను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తానంటూ ప్రశ్నించారు.
కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణ పరిహారం పెంపు ను పరిశీలిస్తామని పేర్కొన్నారు. అనంతరం లగచర్ల ఘటన పైన సీఎం కి వినతిపత్రం అందజేశారు వామపక్ష నాయకులు.