గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నది వాస్తవం కాదా
సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మాజీ మంత్రి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు . ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. వామపక్ష బృందంతో తాము కోడంగల్ లో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయడం లేదని, పర్యావరణ హితం కోరే కంపెనీలనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం.
కానీ ఆయన చెప్పిన మాటలలో వాస్తవం లేదన్నారు కేటీఆర్. ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ ను ఆయన పంచుకున్నారు. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసింది కూడా తప్పేనంటారా అని ప్రశ్నించారు సీఎంను.
సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో కోడంగల్ లో భూసేకరణ ఫార్మా విలేజ్ ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తుందని తెలిపారు కేటీఆర్. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేసింది నిజం కాదా అని పేర్కొన్నారు.
తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. సీఎం సోదరుడు ఆయా గ్రామాలలో తిరుగుతూ బెదిరింపులకు పాల్పడడం లేదా అని నిలదీశారు. ఇంత చేస్తూ..తిరిగి అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాట మార్చడం ఎంత వరకు సబబు అని అన్నారు.