NEWSTELANGANA

ల‌గ‌చ‌ర్ల బాధితుల‌కు అండ‌గా ఉంటాం – కేటీఆర్

Share it with your family & friends

నియంతృత్వ‌పు పోక‌డ‌లు చెల్ల‌నే చెల్ల‌వు

మ‌హబూబాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న నియంతృత్వ‌పు పోక‌డ‌లు చెల్లుబాటు కావ‌న్నారు. కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ల‌గ‌చ‌ర్ల బాధిత రైతుల‌కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, ఎన్ని కేసులు న‌మోదు చేసినా తాము బెదిరే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

14 ఏళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన మలుపునకు కారణమైందన్నారు. మళ్లీ అదే మానుకోట ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు గుంజుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త నియంతకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైందన్నారు.

అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో ఏం జరిగిందో ప్రజలు తెలుసు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అక్కడ ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు సీఎం నిర్ణ‌యంపై భ‌గ్గుమంటున్నార‌ని తెలిపారు కేటీఆర్.

9 నెలలుగా సొంత నియోజకవర్గంలో ఎందుకు సీఎం ప‌ర్య‌టించ లేద‌ని ప్ర‌శ్నించారు. కానీ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా 28 సార్లు ఢిల్లీకి పోయిండు. కనీసం 28 పైసలు కూడా తేలేదన్నారు.
సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు.

మొన్న అధికారులు పోతే ప్రజలు నిరసన తెలిపారని, కానీ రేవంత్ రెడ్డి పోయి ఉంటే దాడికి దిగే వార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గ‌తంలో ఢిల్లీలో రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి మోడీ లాంటి వ్యక్తినే నల్ల చట్టాల నుంచి వెనక్కి తగ్గేలా చేశారని గుర్తు చేశారు. అలాంటి రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడని అన్నారు.

సన్నకారు, బక్క చిక్కిన రైతులతో పెట్టుకున్న సీఎంకు బుద్ధి చెప్పే సమయం వస్తుందన్నారు కేటీఆర్. మానుకోటలో ధర్నా చేస్తామంటే…లగచర్లలో జరిగిన సంఘటనకు మానుకోటలో ధర్నా ఎందుకు అని డీజీపీ ప్ర‌శ్నించార‌ని అన్నారు.

కొడంగల్ రైతుల కోసం ఒక్క మానుకోటలోనే కాదు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ దళితులు, బీసీలు, గిరిజనులు ఉన్నారో అక్కడ ధర్నా చేస్తామ‌ని హెచ్చ‌రించారు.