బీజేపీ కోసం అవార్డులు ఇవ్వలేదు
కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి
హైదరాబాద్ – కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మోదీ ప్రభుత్వం అత్యున్నతమైన పౌర పురస్కారాలను ప్రకటించింది. భారత రత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను డిక్లేర్ చేసింది. మొత్తం 132 పురస్కారాలకు వివిధ రంగాలలో ప్రతిభా పాటవాలను కనబర్చిన వారిని ఎంపిక చేసింది.
ఈ సందర్బంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం, గతంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును రజనీకాంత్ కు అందజేయడం పట్ల తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఇదంతా కేవలం కేంద్రం రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభావితం చేసే ప్రముఖులను ప్రసన్నం చేసుకునే పనిలో పడిందని విమర్శలు లేక పోలేదు. దీనిపై తీవ్రంగా స్పందించారు గంగాపురం కిషన్ రెడ్డి. విపక్షాలు కావాలని బట్ట కాల్చి తమ మీద వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆరోపించారు.