ప్రజా సమస్యలు ప్రస్తావిస్తా
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్ – ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలిలో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు నూతనంగా ఎన్నికైన బల్మూరి వెంకట్. శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో నూతన శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం కొలువు తీరిందని, ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తనకు అవకాశం ఇచ్చిన ఏఐసీసీ హై కమాండ్ కు, పార్టీ చీఫ్ ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ , ప్రియాంక, సోనియా గాంధీలతో పాటు పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని స్పష్టం చేశారు.
నిరుద్యోగుల తరపున తాను మాట్లాడతానని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.