ఆర్టీసీ సిబ్బందిపై దాడులు తగదు
ఉపేక్షించ బోమంటూ ఎండీ వార్నింగ్
హైదరాబాద్ – రోజు రోజుకు తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బందిపై ప్రయాణీకులు దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు దిగడాన్ని తీవ్రంగా ఖండించారు ఎండీ సజ్జనార్. ఇక నుంచి ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నిర్దేశించిన టైం కంటే ఎక్కువగా విధుల్లో పాల్గొంటూ విశిష్ట సేవలు అందజేస్తున్నారని అయినా వారిపై దూషణకు దిగడం, వ్యక్తిగతంగా దాడి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
అత్యంత నిబద్దతతో, నిజాయితీతో, క్రమ శిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని, రాష్ట్ర సర్కార్ తీసుకున్న ఉచిత ప్రయాణం నిర్ణయం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. అయినంత మాత్రాన దాడులకు దిగుతారా అని మండిపడ్డారు.
ప్రతి రోజూ 55 లక్షల మంది ప్రయాణీకులను సురక్షితంగా ఆర్టీసీ సంస్థ బస్సుల ద్వారా తమ తమ గమ్య స్థానాలకు చేరుస్తోందని, ఇలాంటి సమయంలో కండక్టర్లు, డ్రైవర్లపై భౌతిక దాడులకు దిగడం మంచి పద్దతి కాదన్నారు. తాము ఊరుకునే ప్రసక్తి లేదని, ఏదైనా అసౌకర్యం కలిగినట్లయితే సంబంధిత డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక నుంచి ఆర్టీసీ సిబ్బంది పట్ల మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని కోరారు ఎండీ సజ్జనార్.