NEWSANDHRA PRADESH

సింగిల్ విండో విధానం మేలు – ప‌వ‌న్ క‌ళ్యాణ్

Share it with your family & friends

కేంద్ర అటవీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రితో భేటీ

ఢిల్లీ – ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు తెలిపారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. బుధ‌వారం కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు.

బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుందన్నారు. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కస్టోడియన్ గా వ్యవహరిస్తుంద‌న్నారు. ఈ ప్రతిపాదననను పరిశీలించాల‌ని సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుందని తెలిపారు.

ఏ రాష్ట్రంలో పట్టుబడినా ఎర్ర చందనం అరుదైన వృక్ష సంపద. ఆంధ్ర ప్రదేశ్ అటవీ ప్రాంతంలోనే పెరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో కేంద్రం నిబంధనలను సవరించి ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగం కస్టోడియన్ గా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే దక్కేలా చూడాలని సూచించారు.

దీని వల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ము కోవడానికి కుదరదన్నారు. అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతుందన్నారు. కేంద్ర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్టోడియన్ గా కొనసాగుతుందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు.