పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలి
పిలుపునిచ్చిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల
విజయవాడ – ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఎక్కువగా దృష్టి సారించాలని అన్నారు. బుధవారం విజయవాడలో కీలకమైన సమావేశం జరిగింది. తాజాగా నూతనంగా నియమితులైన నియోజకవర్గాల సమన్వయకర్తలు (కో ఆర్డినేటర్లు) తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి.
రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి అండగా నిలుస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలని స్పష్టం చేశారు ఏపీ పీసీసీ చీఫ్.
ఇప్పటి నుంచే రాబోయే ఎన్నికలకు సన్నద్దం అయ్యేలా మనల్ని మనం బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ను అడుగడుగునా నిలదీయాలని, ఎక్కడికక్కడ ప్రజల తరపున ప్రశ్నించాలని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన విధి విధానాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు రఘువీరా రెడ్డి , కొప్పుల రాజు , పల్లంరాజు , జేడీ శీలం హాజరయ్యారు.