ఘనంగా శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు
భక్తులకు ఇబ్బందులు రాకుండా విస్తృత ఏర్పాట్లు
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలను గురువారం నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో జె. శ్యామల రావు చెప్పారు. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడారు. టిటిడిలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, అమ్మవారి ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు చేపట్టామన్నారు.
బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు, పద్మ పుష్కరిణికి నాలుగు వైపులా ఈసారి మొత్తం 20 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు, భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, సైన్ బోర్డులు, రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు.
పంచమి తీర్థం సందర్భంగా డిసెంబరు 5వ తేదీ సాయంత్రం నుండి భక్తులు వేచి ఉండేందుకు తిరుచానూరు పరిసర ప్రాంతాలైన జడ్పీ హైస్కూల్, పూడి రోడ్డు, నవజీవన్, తిరుచానూరు గేటు వద్ద 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు.
ఇందులో మొత్తం 120 కౌంటర్ల ద్వారా దాదాపు 50 వేలకు పైగా భక్తులకు తాగునీరు, బాదంపాలు, బిస్మిల్లా బాత్, పెరుగు అన్నం, విజిటబుల్ ఉప్మాతో పాటు ఈసారి అదనంగా చెక్కెర పొంగలి అందించనున్నట్లు తెలియజేశారు జె. శ్యామల రావు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు రోజుకు 10 వేల మందికి సాంప్రదాయ బద్ధంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్ తో పాటు ఈ సారి అదనంగా కర్రీని అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు.
అమ్మ వారి వాహన సేవలను ఎస్వీబీసీలో హెచ్డి క్యాలిటితో ప్రత్యక్ష ప్రసారాలతో పాటు, ఎస్వీబీసీ ఆన్ లైన్ రేడియో, యూట్యూబ్ ద్వారా కూడా ప్రసారాలు అందిస్తామన్నారు. అమ్మవారి వాహన సేవలో ఏడు రాష్ట్రాల నుండి కళా బృందాలు, అలిపిరి నుంచి తిరుచానూరు వరకు నిర్వహించే శ్రీ పద్మావతి అమ్మవారి సారె శోభయాత్రలో 1000 మంది కళాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు.
బ్రహోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో టిటిడి భద్రతా సిబ్బంది, పోలీసులతో కలిపి 460 మంది, పంచమి తీర్థం రోజున 1500 మంది పోలీసులు, 600 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు ఈవో.
బ్రహోత్సవాల రోజుల్లో 500 మంది, పంచమితీర్థం రోజు 1000 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందిస్తారన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన డిసెంబరు 6వ తేదీ పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను అమ్మ వారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఉదయం 10 గంటలకు అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం మొదలవుతుందని, మధ్యాహ్నం 12.15 గంటల మధ్య పద్మ పుష్కరిణిలో పంచమితీర్థం చక్రస్నానం నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈవో వెంట జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్, సిఇ శ్రీ సత్యనారాయణ, ఎస్ ఇ జగదీశ్వర్‌రెడ్డి, డెప్యూటీ ఈవో గోవింద రాజన్, విజివో సదాలక్ష్మీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.