NEWSTELANGANA

స‌ర్వే అధికారుల‌కు వివ‌రాలు ఇచ్చిన సీఎం

Share it with your family & friends

కుల గ‌ణ‌న స‌ర్వేపై రేవంత్ రెడ్డి ఆరా

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కుల గ‌ణ‌న స‌ర్వే యుద్ద ప్రాతిప‌దిక‌న జ‌రుగుతోంది. ఇప్ప‌టికే 90 శాతానికి పైగా పూర్త‌యిన‌ట్లు సమాచారం. గురువారం కుల గ‌ణ‌న స‌ర్వే అధికారులు హైద‌రాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో నివాసం ఉంటున్న ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు.

ఈ సంద‌ర్బంగా స‌ర్వే అధికారులు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. ప్ర‌భుత్వం నిర్దేశించిన పూర్తి వివ‌రాల‌ను అంద‌జేశారు. అనంత‌రం స‌ర్వే అధికారుల‌తో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స‌ర్వే తీరు తెన్నుల గురించి సీఎం ఆరా తీశారు.

ప్ర‌భుత్వం కుల గ‌ణ‌న స‌ర్వేను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి. సామాజిక‌, ఆర్థిక‌, ఉపాధి, విద్య‌, రాజ‌కీయ రంగాల‌కు సంబంధించిన వివ‌రాలు ఇందులో చేర్చ‌డం జ‌రిగింద‌న్నారు.

ఈ కుల గ‌ణ‌న స‌ర్వే భార‌త దేశానికి రోల్ మోడ‌ల్ కావాల‌ని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. అన్ని వ‌ర్గాల‌కు సంబంధించిన వివ‌రాలు ఈ స‌ర్వే ద్వారా తెలుసుకునేందుకు వీలు క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు సీఎం. ఇదిలా ఉండ‌గా రేవంత్ రెడ్డికి సంబంధించిన వివ‌రాలు తీసుకున్న ఎన్యూమ‌రేట‌ర్లు ఆయ‌న‌తో ఫోటో దిగారు. వారు సంతోషానికి లోన‌య్యారు. ప్ర‌త్యేకంగా స‌ర్వే చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు రేవంత్ రెడ్డి.