ఆకట్టుకుంటున్న పుష్ప ప్రదర్శనశాల
శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి – శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుచానూరు లోని శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇందులో టీటీడీ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో ‘ హిరణ్యక్షుడనే రాక్షసుడిని సంహరించి భూదేవిని కాపాడుతున్న వరాహ రూపంలో ఉన్న శ్రీమహా విష్ణువు, వాలి సుగ్రీవుల మధ్య జరిగే యుద్ధంలో చెట్టు చాటు నుండి వాలిని సంహరిస్తున్న రాముడు, శ్రీ రామ రావణ యుద్ధంలో వనరులతో యుద్ధం చేస్తున్న కుంభకర్ణుడు అనే రాక్షసుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు.
శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి వారు ఆరగించిన లడ్డును ముసలి అవ్వ రూపమున అన్నమయ్యకు అందిస్తున్న పద్మావతమ్మ, సీతాదేవి అన్వేషణలు శ్రీరామ లక్ష్మణుల సమక్షంలో లంకకు వారధి కడుతున్న వానర సైన్యం, ఎరుకుల సాని వేషంలో పద్మావతి దేవికి సోది చెబుతున్న శ్రీనివాసుడు, లక్క గృహం దహనం నుండి తల్లి కుంతీదేవితో సహా సోదరులను కాపాడుకొని తన భుజస్కందాలపై తీసుకొస్తున్న భీమసేనుడు, చిన్ని కృష్ణుడిని యమునా నది దాటిస్తున్న వసుదేవుడు రావణాసురుడిని సంహరిస్తున్న శ్రీరాముడు తదితర ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.
వివిధ పుష్పాలు, కూరగాయలతో ఏర్పాటు చేసిన జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. మైసూర్ కు చెందిన గౌరి గత 9 సంవత్సరాలుగా సైకిత శిల్పాన్ని తయారు చేస్తోంది, ఈ ఏడాది అమ్మ వారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి సైకిత శిల్పాన్ని రూపొందించారు.
అదే విధంగా, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఎక్స్‌పో ఆయు, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఏర్పాటు చేసిన శిల్ప కళ ప్రదర్శనశాల భక్తులను ఆకట్టుకుంటోంది.
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి డా. కార్తీక్, డా. వాణి ఆధ్వర్యంలో 80 మంది, ఎస్పీడబ్ల్యూ కాలేజీ నుంచి బాటనీ విభాగానికి చెందిన డా.జ్యోతి ఆధ్వర్యంలో 70 మంది విద్యార్థినులు ఫలపుష్ప ప్రదర్శన శాలను తిలకించారు.