హిందువులకు రక్షణ కల్పించాలి – పవన్ కళ్యాణ్
ఐక్య రాజ్య సమితిని కోరిన ఏపీ డిప్యూటీ సీఎం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ దేశంలో రోజు రోజుకు మైనార్టీలుగా ఉన్న హిందువులపై పనిగట్టుకుని దాడులు కొనసాగుతున్నాయని తీవ్ర ఆవేదన చెందారు. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలంగా సనాతన ధర్మానికి తీరని అన్యాయం జరుగుతోందని వాపోయారు.
హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతుండడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రోజు రోజుకు బతికే పరిస్థితి లేకుండా పోతోందని మండిపడ్డారు. వెంటనే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరారు. లేకపోతే భారత దేశ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటుందని హెచ్చరించారు.
పాలస్తీనాలో ఏదైనా జరిగితే అందరూ స్పందిస్తారని, కానీ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరిగితే ఏ ఒక్కరు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. హిందువులపై జరుగుతున్న అకృత్యాలను అంతం చేయాలని ఆయన తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్‌ను డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్రం కూడా చర్యలు తీసుకోవాలని పీఎం మోడీకి, కేంద్ర మంత్రి అమిత్ షాకు సూచించారు.