ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి…?
ఏకగ్రీవంగా హైకమాండ్ కు విన్నపం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని బరిలో నిలబెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు .
శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జరిగిన సమావేశంలో మంత్రులు, ఎంపీలు, నాయకులు జీవన్ రెడ్డిని పోటీ చేయించాలని ఏకగ్రీవంగా హైకమాండ్ ను కోరడం జరిగిందని వెల్లడించారు. ఈ విషయాన్ని మీడియా సాక్షిగా పేర్కొన్నారు.
ప్రస్తుతం జీవన్ రెడ్డి శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. తన నియోజకవర్గం పరిధిలో ఇటీవల తన ముఖ్య అనుచరుడిని దారుణంగా హత్య చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఈ సమయంలో తిరిగి ఆయనకే ఎమ్మెల్సీ ఇస్తేనే న్యాయం చేసినట్లవుతుందని మూకుమ్మడిగా పేర్కొన్నట్లు తెలిపారు షబ్బీర్ అలీ.
కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు జీవన్ రెడ్డి. ఆయనను అంతా అజాత శత్రువుగా చూస్తారు. గతంలో మంత్రిగా కూడా పని చేశారు. సౌమ్యుడిగా పేరు పొందారు. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుండడంతో జీవన్ రెడ్డికి మంచి పేరుంది.