చరిత్ర మరిచి పోని రోజు దీక్షా దివస్
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ గారు తెగించిన రోజు నేడు అని పేర్కొన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు.
తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి..స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భం ఇది అని పేర్కొన్నారు
ఇన్నేళ్ళు గడిచినా ఆ నాటి పరిస్థితులు ఇంకా నా ముందు కదలాడుతూనే ఉన్నాయని హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైందన్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ‘The Coalition Years: 1996-2012’ పుస్తకంలో కెసిఆర్ నిబద్ధత గురించి ఎంతో గొప్పగా ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్బంగా మరోసారి తెలంగాణ ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు .
కేంద్ర మంత్రిగా మీకు ఏ శాఖ కేటాయించాలి అని అడిగినప్పుడు కేసీఆర్ ఇచ్చిన సమాధానం.. ఒక్కటేనని అది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని కుండ బద్దలు కొట్టారని తెలిపారు.
“ప్రణబ్‌జీ, నా లక్ష్యం మీకు తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి. మీరు నాకు ఏ శాఖను కేటాయించారనేది ముఖ్యం కాదు. మీరేది కేటాయించినా నాకు సమ్మతమే. కానీ దయచేసి తెలంగాణను ఇవ్వండి.” ఇదీ కేసీఆర్ అంటే. ఇదీ ఆయన కమిట్మెంట్ అంటే అని తెలిపారు.
కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ. కెసిఆర్ ఉద్యమ ఫలితం తెలంగాణ అని స్పష్టం చేశారు.