ఎన్నికల బరిలో బండ్ల గణేశ్
కాంగ్రెస్ అభ్యర్థుల రేసులో నిర్మాత
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. విచిత్రం ఏమిటంటే ఊహించని రీతిలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఉన్నట్టుండి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆయన పీసీసీ కార్యాలయంలో వరుసగా గత ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి కేసీఆర్, కేటీఆర్ , కల్వకుంట్ల కుటుంబాన్ని ఏకి పారేశారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు బండ్ల గణేష్ పై పడింది.
గత ఎన్నికల్లో సీరియస్ కామెంట్స్ చేశారు. తాను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అప్పుడు వర్కవుట్ కాలేదు. కానీ ఈసారి తాను అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో గణేశ్ వాయిస్ మరింత పెరిగింది. అది తారా స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం తాను కూడా ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు. ఈ మేరకు పదే పదే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా బండ్ల గణేశ్ మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు దరఖాస్తు కూడా చేసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలలో జోరుగా చర్చ కొనసాగుతోంది.