NEWSANDHRA PRADESH

ముంచుకొస్తున్న ఫెంగ‌ల్ తుఫాన్

Share it with your family & friends

హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ‌

అమ‌రావ‌తి – నైరుతి బంగాళాఖాతంలో ఫెంగ‌ల్ తుఫాన్ ముంచుకొస్తోంది. గ‌డిచిన 6 గంట‌ల్లో గంట‌కు 7 కి.మీ. వేగంతో క‌దులుతోంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 180 కి.మీ, చెన్నైకి 190 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయ‌ని ఏపీ వాతార‌ణ శాఖ హెచ్చ‌రించింది. రైతులు, మ‌త్స్య‌కారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

తాజాగా ఫెంగ‌ల్ తుఫాన్ వాయువ్య దిశ‌గా క‌దులుతోంద‌ని తెలిపారు వాతావ‌ర‌ణ శాఖ కేంద్రం డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ కూర్మ‌నాథ్. దీని ప్ర‌భావంతో కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌న్నారు.
మిగిలిన చోట్ల తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు.

తుపాను కార‌ణంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70 నుంచి 90 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయ‌ని హెచ్చ‌రించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం ఉంద‌న్నారు డాక్ట‌ర్ కూర్మ‌నాథ్.

ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు. రైతులు ముఖ్యంగా అలర్ట్ గా ఉండాల‌ని, స‌ర్కార్ ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు .