ప్రాజెక్టుల్ని కృష్ణా బోర్డుకు అప్పగిస్తే ఎలా
ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ప్రధానంగా ప్రాజెక్టులను ఏ ప్రాతిపదికన కృష్ణా బోర్డుకు అప్పగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్కార్ పూర్తి గందరగోళంలో ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కనీసం అవగాహన కూడా లేకుండా పోయిందని మండిపడ్డారు.
ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించిన అంశాలనే పేర్కొంటూ 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఇవాళ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్ లు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు హరీశ్ రావు.
ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షిస్తామని గొప్పగా చెప్పారని ఇవాళ ఏం జరిగిందో జనానికి అర్థమై పోయిందన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని వీటిని ఎందుకు అప్పగించారో చెప్పాలన్నారు.
ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుందని , చివరకు తాగు , సాగు నీటికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయని హెచ్చరించారు.