NEWSTELANGANA

కుల స‌ర్వేపై స‌ర్కార్ కు హైకోర్టు షాక్

Share it with your family & friends

వృత్తులు కాకుండా కులంగా ప‌రిగ‌ణించాలి

హైద‌రాబాద్ – సమగ్ర కుల సర్వేలో కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి , శిల్పిలను విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని రాష్ట్ర హైకోర్టు స్ప‌ష్టం చేసింది. అడ్వ‌కేట్ పెందోట శ్రీ‌నివాస్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై ఉత్త‌ర్వులు జారీ చేసింది. విశ్వ బ్రాహ్మ‌ణ కులం కాకుండా వృత్తి ప‌రంగా వేర్వేరు కులాల‌ను చేర్చి స‌ర్వే చేయ‌డంపై కోర్టు స్ప‌ష్టత ఇచ్చింది. తాజా స‌ర్వేలో కులం ప్రాతిప‌దిక‌న కాకుండా వృత్తుల‌ను అనుస‌రించి చేస్తుండ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు పిటిష‌న‌ర్.

రాష్ట్రంలో ప్రస్తుతం సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే లో విశ్వబ్రాహ్మణ కులం కాకుండా వృత్తి పరంగా వేర్వేరు కులాలను చేర్చి సర్వే చేయడం ప‌ట్ల విశ్వ బ్రాహ్మ‌ణులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో బీసీ కులాలను వర్గీకరించిన జీ.ఓ.లో వృత్తులైన కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి , శిల్పిలను విశ్వబ్రాహ్మణ కులంగా పేర్కొంటూ స్పష్టంగా తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సమగ్ర కుటుంబ సర్వే లోని ఫారాలలో విశ్వ బ్రాహ్మణ కులం కాకుండా వృత్తులను అనుసరించి కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి , శిల్పి లను వేర్వేరు కులాలుగా పేర్కొంది.

దీనితో, వేర్వేరు కులాలుగా పేర్కొనడం పట్ల విశ్వ బ్రాహ్మణ సంఖ్య తగ్గి రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలలో తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొంటూ, విశ్వ బ్రాహ్మణ సంఘాలు రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు, బీసీ కమీషన్ కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి పలు విజ్ఞాపనలు అందజేశాయి. అయినప్పటికీ, సర్వే ఫారాలలో సరి చేయకుండా కొనసాగించడాన్ని సవాలు చేస్తూ, విశ్వ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోషియేషన్ కు చెందిన సీనియర్ అడ్వకేట్ పెందోట శ్రీనివాస్ హై-కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

వృత్తి పరంగా కాకుండా కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి , శిల్పిలను ఒకే కులంగా విశ్వ బ్రాహ్మణులుగా ఒకే కోడ్ గా పరిగణించాలని వేసిన పిటీషన్ ను హై-కోర్ట్ (11వ కోర్టు) జస్టిస్ సూరేపల్లి నందా పరిగణనలోకి తీసుకొని, కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి , శిల్పిలను వేర్వేరుగా కాకుండా, విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర హై-కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వుల పట్ల విశ్వబ్రాహ్మణ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.