కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం
స్థలాన్ని పరిశీలించిన జేఈవో గౌతమి
తిరుమల – ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా హిందు ధర్మ ప్రచారం కోసం టీటీడీ భాగం కానుంది.
ఈ సందర్భంగా ప్రయాగ రాజ్ లో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ జేఈఓ (ఆరోగ్యం, విద్య) గౌతమి ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్(ఐఏఎస్)ను లాంఛనంగా కలిశారు.
ప్రయాగ రాజ్ లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు కుంభమేళా అధికారులు టీటీడీకి ఆరో సెక్టార్ లో 2.50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
ఈ సందర్భంగా జేఈవో ఆ స్థలాన్ని టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కుంభమేళాకు తరలివచ్చే ఉత్తరాది భక్తులను దృష్టిలో ఉంచుకుని నమూనా ఆలయం వద్ద ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
స్థలాన్ని పరిశీలించిన టీటీడీ బృందంలో హెచ్ డీపీపీ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, ఇతర స్థానిక అధికారులు ఉన్నారు.